సిద్దిపేట/ములుగు, వెలుగు: ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడించి చావు డప్పు కొడతామని కాంగ్రెస్ నేతలు, అడ్డుకొని తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ ప్రకటనలు చేయడంతో శాంతిభద్రతల సమస్య తలెత్త కుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. సిద్దిపేట జిల్లా ముఖ్య నేతలను ముందే హౌస్ అరెస్ట్ చేశారు. ఎర్రవల్లికి దారితీసే ప్రధాన మార్గాలను బారి కేడ్లతో మూసివేసి, అడ్డదారులపైనా ఫోకస్ పెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా వచ్చినవారిని వచ్చినట్లే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అటు ఫామ్ హౌజ్ దగ్గర వెయ్యి మంది పోలీసులను భారీగా మోహరించారు. డప్పులతో ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎర్రవల్లికి అర కిలోమీటరు దూరంలోనే ఆపి ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ శివార్లలోనే అడ్డుకున్నారు. మొత్తం మీద హైదరాబాద్‌లోని డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి ఎస్ఐల వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా హౌస్ అరెస్ట్‌లు..
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడిస్తామని పీసీసీ ఎస్సీ సెల్, అడ్డుకొని తీరుతామని బీఆర్ఎస్ ప్రకటించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగళవారం ఉదయానికే ఎర్రవల్లిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫామ్ హౌజ్‌కు దారితీసే నాలుగు ప్రధాన మార్గాల్లో భారీగా పోలీసులను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటుకుని రావచ్చనే అనుమానంతో ఫామ్ హౌజ్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా డీసీఎం వాహనాలను నిలిపివేశారు. ఈ ముట్టడి నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే సిద్దిపేట జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
వేర్వేరు మార్గాల్లో ఎర్రవల్లి వైపు వస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌కు బయల్దేరగా.. హకీంపేట చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఎంత చెప్పినా బీఆర్ఎస్ నేతలు వినలేదు. ఎమ్మెల్యేలంతా కార్లు దిగి నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని అరెస్ట్ చేసి వేర్వేరు స్టేషన్లకు తరలించారు. హరీశ్ రావును జవహర్ నగర్, కేటీఆర్ ను బోయినపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
వెయ్యి మంది పోలీసుల మోహరింపు..
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఎర్రవల్లి ఫామ్ హౌజ్ వద్ద దాదాపు వెయ్యి మంది పోలీసులను మోహరించారు. సీపీ రష్మీ పెరుమాళ్‌తో పాటు యాదాద్రి జోన్ డీఐజీ, హైదరాబాద్ ట్రాఫిక్ జేసీ జోయల్ డేవిస్, సైబరాబాద్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ ముట్టడి నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన దాదాపు 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ములుగు, మర్కూక్, జగదేవ్‌పూర్, గౌరారం పోలీస్ స్టేషన్లకు తరలించి, రాత్రి స్వంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
సంయమనం పాటించిన పోలీసులు..
ఫామ్ హౌజ్ ముట్టడి సందర్భంగా పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. దామర కుంట, వరదరాజపూర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొ నడంతో ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టా రు. దామరకుంట వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో, వారిని అక్కడి నుంచి పంపిం చి గొడవ పెద్దది కాకుండా చర్యలు తీసుకు న్నారు. వరదరాజుపల్లి నుంచి డీసీసీ అధ్యక్షురా లు ఆంక్షారెడ్డి నేతృత్వంలో ఫామ్ హౌజ్ ముట్ట డికి బయల్దేరిన కాంగ్రెస్ కార్యకర్తలను కొద్ది దూరంలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగినా వారిని సముదాయించి అదుపులోకి తీసుకున్నారు. సంయమనం పాటించడంతో పెద్ద గొడవలు జరగలేదు.
